Telangana: నేడు మావోయిస్టు పార్టీ బంద్ పిలుపు..! 13 d ago
TG : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా సంబరాలు నిర్వహిస్తుంది. మావోయిస్టు పార్టీ బంద్ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతం నివురుగప్పిన నిప్పులా మారింది. పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. సరిహద్దు అడవులను జల్లడపడుతూ మావోయిస్టులను పట్టుకోవటమే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
పోలీసుల హై అలర్ట్ ప్రకటించటంతో ఏజెన్సీ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చల్పాక అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్కు నిరసనగా మావోయిస్టు పార్టీ సోమవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో మావోయిస్టులు కీలక ఆరోపణలు చేశారు. మావోయిస్టు పార్టీ దళం 30వ తేదీన చల్పాక అడవుల్లో బస చేసింది నిజమే అని ప్రకటించారు. మావోయిస్టు దళంపై విషప్రయోగం చేసి హతమార్చారని తెలిపారు . ఆ ఎన్కౌంటర్కు కాంగ్రెస్ ప్రభుత్వం – ఆ పార్టీ నేతలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఆ ఎన్కౌంటర్కు నిరసనగా 9వ తేదీ సోమవారం రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పీఎల్జీఏ వారోత్సవాలకు ముందుగానే ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏకంగా ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు కీలక నేతలు ఉండగా మరో ఐదుగురు ద్వితీయ శ్రేణి మావోయిస్టులు ఉన్నారు. ఆహారంలో విషప్రయోగం చేసి పట్టుకొని, చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని మృతుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు కోర్టును ఆశ్రయించారు.